కరోనా నుంచి రక్షించుకునేందుకు మాస్కులు ధరించడం తప్పని సరి. ఇందుకోసం మర్కెట్లో వివిధ రకాల మాస్కులు అందుబాటులో ఉంటున్నాయి. వీటితో పాటు అనేకమంది ఇంట్లోనే వస్త్రాలతో మాస్కులు తయారు చేసుకుంటున్నారు. అయితే ఈ తరహా మాస్కులను.. అధిక ఉష్ణోగ్రతల మధ్య రోజూ ఉతకాలని, లేకపోతే కరోనా సోకకుండా ఇవి అడ్డుకోలేవని ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.
"వస్త్రంతో తయారు చేసిన మాస్కులతో పాటు సర్జికల్ మాస్కులను ఒకసారి వినియోగించిన అనంతరం వాటిని కలుషితమైనవిగా పరిగణించాలి. సర్జికల్ మాస్కులను పడేస్తారు. కానీ వస్త్రంతో రూపొందించిన మాస్కులను చాలా రోజుల పాటు వాడతారు. అయితే.. చేతులతో వీటిని కడిగినా, తుడిచినా ఇవి ఇంకా కలుషితంగానే ఉంటాయని మా పరిశోధనలో తేలింది."
--- రైనా మాక్లెన్టైర్, ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం.
2015లో ప్రచురించిన ఆర్సీటీ(రాండమైజెడ్ కంట్రోల్డ్ ట్రయల్) డేటాను విశ్లేషించారు పరిశోధకులు. వైరస్ ఇన్ఫెక్షన్ను నిరోధించడంలో వస్త్రంతో రూపొందించిన మాస్కుల సామర్థ్యాన్ని ఇందులో పరిశీలించారు.
తాము వినియోగించే మాస్కులను ఆరోగ్య కార్యకర్తలు రోజు కడుగుతున్నారా? అనే విషయానికి సంబంధించి 2011లో సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అయితే ఈ అధ్యయనంలో సార్స్-కొవ్-2ను పరీక్షించలేదు. ఇన్ఫ్లుయెంజా, రినో వైరస్ వంటి పాథోజెన్లను పరిశీలించారు.
ఇదీ చూడండి:- ఎదుటివాళ్లు మాస్క్ పెట్టుకోలేదా? ఇలా చెప్పండి..