CJI JUSTICE NV RAMANA UAE TOUR: ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మాతృభూమిని, మాతృభాషను మరవొద్దని.. మూలాలను విడవొద్దని యూఏఈలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. యూఏఈలో కష్టపడి శ్రమిస్తున్న భారతీయులను ఆయన అభినందించారు. వారిని నిజమైన భారత దౌత్యవేత్తలుగా అభివర్ణించారు. "ఎక్కడ ఉన్నా మీ సంస్కృతిని కాపాడుకోండి. పండుగలు జరుపుకోండి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోండి. నిరంతరం వీటిని కొనసాగించినప్పుడే సమాజాల మధ్య సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది" అని సీజేఐ పేర్కొన్నారు. భారత మధ్యవర్తిత్వ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న దుబాయ్‌లో జరిగే 'ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం' అన్న సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ఆయన గురువారం అబుదాభిలోని 'ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్' నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రసంగించారు.
"యూఏఈ న్యాయశాఖ మంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఇక్కడి భారతీయులను ప్రశంసిస్తున్నారు. ఆ అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది. మాతృభూమికి మంచిపేరు తెస్తున్న మీరే నిజమైన భారత దౌత్యవేత్తలు. వ్యక్తుల అప్పగింత, డిక్రీల అమలు, క్రిమినల్ కేసుల్లో సహకారం లాంటి న్యాయపరమైన విషయాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి భారత్-యూఏఈలు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాయి. 175 మంది వ్యక్తుల అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇక్కడి న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాను. అప్పగింత ఉత్తర్వుల అమలును వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 105 మంది ఖైదీల బదిలీ అంశం, ఇక్కడి జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలకు న్యాయవాదులను అందుబాటులో ఉంచడం గురించీ చెప్పాం. కార్మికులు, ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సందర్భంలో వారికి అనుకూలంగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంవల్ల బాధితులకు ప్రయోజనాలు దక్కడం లేదని చెప్పినప్పుడు ప్రతి ఆరు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి తీర్పులను అమలుచేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనువాదకులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల కోర్టుల్లో వస్తున్న ఆచరణాత్మక సమస్యల్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా మీకు నేనేమీ వాగ్దానాలు చేయలేను. అయితే ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్‌లాంటి సంస్థలు భారత్‌లో న్యాయం అవసరమైన వారికోసం న్యాయసహాయ కేంద్రాలు ఏర్పాటుచేసే అంశాన్ని ఆలోచించాలని కోరుతున్నా" అని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీజేఐ సతీమణి శివమాల, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, భారత రాయబారి సంజయ్‌సుధీర్‌లు పాల్గొన్నారు. అంతకుముందు సీజేఐ ఎన్.వి.రమణ యూఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్లా బిన్ సుల్తాన్ బిన్ అవద్ అల్ నుయాయిమి, ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి హమద్ అల్ బదీని కలిశారు. "జస్టిస్ హిమాకోహ్లి, జడ్జి అబ్దుల్ రహమాన్ సమక్షంలో భారతీయ ప్రవాసులకు సంబంధించిన విషయాలు, రెండు దేశాల మధ్య సన్నిహిత న్యాయ సహకారంపై చర్చ జరిగింది. సీజేఐ చారిత్రాత్మక పర్యటన రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది" అని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత జడ్జి