చైనాలో వరుస హత్యలు చేస్తూ.. రోజుకో పేరు మారుస్తూ.. దాదాపు 20 ఏళ్లపాటు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది ఓ మహిళ. తన బాయ్ఫ్రైండ్తో కలిసి.. ఎన్నో నేరాలకు పాల్పడిన లావో రోంగ్జికి.. ఉరిశిక్ష ఖరారు చేసింది జియాంగ్జీ రాష్ట్రంలోని కోర్టు.
అంతేకాక ఆమె వ్యక్తిగత ఆస్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆమెకు రాజ్యాంగపరమైన హక్కులను కూడా రద్దు చేసింది. లావో కావాలనే వాళ్లను హత్యచేసినట్లు, ఆమె ప్రవర్తన క్రూరంగా ఉందని కోర్టు నిర్ధరించింది. ఈ క్రమంలో ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేయగా.. ఇది విన్న లావో.. కోర్టులోనే ఏడ్చింది. పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్తానని పేర్కొంది.
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి..
1996-1999 మధ్యకాలంలో తన బాయ్‌ఫ్రెండ్ ఫా జియాంగ్‌తో కలిసి ఏడుగురిని హతమార్చింది. అనేక దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడింది లావో. ఫా జియాంగ్ 1999లోనే హీఫీ ప్రాంతంలో పోలీసుల చేతికి చిక్కాడు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది.
ఆ తర్వాత లావో.. అదృశ్యమైంది. నకిలీ ధ్రువపత్రాలతో దేశంనుంచి పారిపోయేందుకు యత్నించి.. 20 ఏళ్ల తర్వాత చివరికి పోలీసులకు చిక్కింది. జియాంగ్జీ రాష్ట్రంలోని స్థానిక కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించగా.. ఈ తీర్పుపై ఆమె పైకోర్టుకు అప్పీల్ చేస్తానని పేర్కొంది.
ఇదీ చదవండి: కూలిన సైనిక విమానం- లెఫ్టినెంట్ కల్నల్ సహా ముగ్గురు మృతి