కరోనా వైరస్‌కు టీకాను కనిపెట్టడంలో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ దేశ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న ఓ పరిశోధన సంస్థ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది. క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు మూడు వ్యాక్సిన్‌లకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని అక్కడి అధికార పత్రిక ప్రకటించింది.
కరోనా వైరస్ మొట్టమొదట చైనాలోని వుహాన్ నగరంలోనే పుట్టిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి దాదాపు 20 లక్షల మందికి సోకగా... 1,20,000 మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదకరంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేపట్టాయి. అందులోనూ చైనాయే ముందుండటం గమనార్హం.
ప్రారంభమైన రెండోదశ ట్రయల్స్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్‌కు చెందిన మేజర్ చెన్ వీ నేతృత్వంలో 'ఎడినోవైరస్ వెక్టర్ వ్యాక్సిన్'ను అభివృద్ధి చేస్తున్నారు. అన్నింటికన్నా ముందు క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఈ వ్యాక్సిన్‌కే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి చివరి వారంలో తొలి దశ ముగియగా ఏప్రిల్ 12న రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ఆరంభమయ్యాయి.
వైరస్ నాశనానికే అధిక ప్రాధాన్యత
మొదటి దశలో వాలంటీర్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగా.. రెండో దశలో వైరస్‌ను నాశనం చేయగలిగే సామర్థ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిసింది. గురువారం నుంచి వలంటీర్ల ఎంపిక ప్రక్రియ ఆరంభం కాగా ఆదివారం రెండోదశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టారు. సుమారు 500 మంది వలంటీర్లకు టీకా ఇచ్చారు. వుహాన్ నివాసి షియాంగ్ జెంగ్‌షింగ్(84) ట్రయల్స్‌లో భాగస్వామి అయిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. మొదటి దశలో తక్కువ మందికే ట్రయల్స్ చేశారు.
ఇదీ చదవండి: 'న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకో.. నేనున్నాను'