చైనాకు చెందిన ఓ నిఘా విమానం.. తైవాన్‌లోకి ప్రవేశించినట్టు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. వై-8 యుద్ధ విమానం.. తైవాన్ వైమానిక రక్షణ గుర్తింపు స్థావరంలోని నైరుతి విభాగంలోకి ప్రవేశించిందని పేర్కొంది.
దక్షిణ చైనా సముద్రంలో తమ నియంత్రణలో ఉన్న డోంగ్షా దీవుల మధ్య చైనా యుద్ధ విమానం గగనతలంలోకి ప్రవేశించినట్టు తైవాన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాటి కదలికలను పర్యవేక్షించేందుకు ఫైటర్ జెట్స్‌ను రంగంలోకి దింపడం సహా.. రేడియో హెచ్చరికలు జారీచేసింది సైనిక విభాగం. ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్(ఏడీఐజడ్) నుంచి చైనా యుద్ధ విమానం వెళ్లే వరకు వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా వ్యవహరించాయి.
ఈ నెలలో ఐదోసారి..
తైవాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న క్రమంలో చైనా ఇలా చొరబాటు యత్నాలు చేస్తోంది. స్వతంత్రం కోసం ప్రయత్నిస్తే యుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో తైవాన్ రాజధాని నగరమైన తైపీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటం వల్ల.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు ఐదుసార్లు చైనా విమానాలు తైవాన్‌లోకి ప్రవేశించాయి. ఫిబ్రవరి 1, 2, 4, 5 తేదీల్లోనూ.. తమ దేశంలోకి చైనా విమానాలు చొరబడినట్టు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబవుతున్న చైనా