ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై చైనీయులు ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాంటి నిరాశకు గురికాకుండా విశ్వం గురించి అన్వేషణను కొనసాగించాలని ఇస్రోకు మద్దతు పలికారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
చంద్రయాన్-2 చివరి దశలో సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్ విక్రమ్ నుంచి అర్థాంతరంగా సంకేతాలు నిలిచిపోయాయి. ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణపై విశ్వాసం వ్యక్తం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ల్యాండర్ ఒరిగి ఉంది తప్ప ముక్కలు కాలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో చైనా నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఇస్త్రో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలిచారు.
"అంతరిక్ష అన్వేషణ మానవులందరినీ ఆకర్షిస్తోంది. ఏ దేశం పురోగతి సాధించినా మనం ప్రశంసలను అందించాలి. ప్రస్తుతం విఫలమైనా సరే వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి." అంటూ ట్విట్టర్ యూజర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
"భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధన కోసం గొప్ప ప్రయత్నాలు, త్యాగాలు చేశారు" అని మరొకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు.