కొంత దూరమే అయినా నడిచి వెళ్లడానికి ఒక్కోసారి కొందరు ఎంతో ఆయాస పడుతూ ఉంటారు. చెమటలు కక్కుతూ అలిసిపోతుంటారు. మాకా ఇబ్బంది ఏమీ లేదంటోంది చైనాలోని ఓ ఏనుగుల గుంపు. వందల కిలోల భారీ కాయంతో ఈ ఏనుగుల గుంపు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 కిలోమీటర్లు నడుస్తూ ప్రయాణం చేశాయి మరి. గత ఏడాది యువాన్ ఫ్రావిన్స్‌లోని నేచర్ రిజర్వ్ నుంచి బయటకు వచ్చిన 16 అడవి ఏనుగులు ఏకమై ఈ దూరాన్ని నడిచాయి. 15 నెలలుగా అనేక పట్టణాల గుండా వీటి ప్రయాణం సాగుతుండగా.. ప్రస్తుతం ఇవి 70 లక్షల జనాభా గల కున్మింగ్ నగరానికి సమీపంలో ఉన్నాయి. 16 ఏనుగుల్లో రెండు తిరిగి వెనక్కి వెళ్లి పోగా, మధ్యలో ఓ పిల్ల ఏనుగు పుట్టడం వల్ల ప్రస్తుతం 15 ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్..
ఏనుగుల గుంపు ప్రయాణం ఆరంభమైన నాటి నుంచి ప్రపంచ మీడియా వీటిపై దృష్టి సారించింది. ఫలితంగా.. ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు ఈ ఏనుగులు గుంపు వీడియోలతో నిండి పోయాయి. గుంపులోని మూడు పిల్ల ఏనుగుల చేష్టలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మనం కూడా ఏనుగుల లాగా ఐక్యంగా ఉండి ఒకరికొకరు రక్షణగా ఉందామంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. చైనాలోని ప్రముఖ సామాజిక మాధ్యమం విబోలో కొన్ని రోజులుగా ఈ ఏనుగుల గుంపు అంశం ట్రెండింగ్‌లో ఉంది. ఈ బృందం ఆదమరచి నిద్రపోతున్న దృశ్యాలకు సోమవారం రాత్రి వరకు 25 వేల పోస్టులు రాగా, ఇవి 200 మిలియన్ల వ్యూస్‌లను సొంతం చేసుకున్నాయి.
నిపుణుల పర్యవేక్షణలో ఏనుగుల ప్రయాణం
ఏనుగుల గుంపు ప్రయాణాన్ని 410 మందితో కూడిన ప్రత్యేక బృందం.. నిత్యం గమనిస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు, 14 డ్రోన్ల సాయంతో వీరు ఏనుగుల గుంపు కదలికలపై నిరంతరం నిఘా పెట్టారు. గజరాజులు రోడ్లపైకి చేరుకున్నప్పుడు ట్రాఫిక్‌ను నిలువరిస్తున్నారు. అవి వెళ్లే దిశగా.. రెండు టన్నుల ఆహారాన్ని ఉంచారు. ఫలితంగా ఏనుగులు తిరిగి వాటి చోటుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
తేలని మిస్టరీ..
ఏనుగులు 500 కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం చైనాలో ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఐతే ఏనుగులు సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు ప్రేరేపించిన కారణం మాత్రం మిస్టరీగానే ఉంది. మొక్కజొన్న సహా రుచికరమైన పంటలు, ఫలాలు కోసమే ప్రయాణిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గుంపునకు నేతృత్వం వహిస్తున్న ఏనుగుకు తగిన అనుభవం లేకపోవడం వల్ల ఇలా అడవులు విడిచి వచ్చినట్లు కూడా భావిస్తున్నారు.
ఇదీ చదవండి : గబ్బిలాలూ 'సెల్ఫ్ ఐసోలేషన్'లోకి వెళ్తాయా?