ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన చైనాలో తీరుతెన్నులు త్వరలో మారనున్నాయి. నాలుగేళ్లలో చైనాలో జనాభా గరిష్ఠ స్థాయికి చేరి, 2025 తర్వాత మాత్రం తగ్గడం మొదలవుతుందని ఆర్థికవేత్త కాయ్ ఫాంగ్ చెప్పారు. దీనివల్ల వినియోగ వస్తువుల డిమాండ్లో తగ్గుదల నమోదవుతుందని వివరించారు. జనాభా తీరుతెన్నులు, భవిష్యత్ వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నెలాఖరులో చైనా తన తాజా జనాభా లెక్కలను వెల్లడించనున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
కుటుంబ నియంత్రణ విధానాలను సరళీకరించకుంటే 2050 నాటికి కార్మికుల సంఖ్య తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని 'పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా' ఇటీవల ఒక నివేదికలో స్పష్టం చేసింది. సంతానాన్ని పొందే అంశంలో ప్రజలకున్న ఇష్టాయిష్టాలపై ప్రభుత్వ జోక్యం తగదని పేర్కొంది. వివాదాస్పద ఏక సంతానం విధానాన్ని మూడు దశాబ్దాలకుపైగా అమలు చేసిన చైనా ఇప్పుడు జనాభాపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 60 ఏళ్లు పైనున్న వారి సంఖ్య 42 కోట్లకు చేరుకుంది. దీంతో ఇద్దరు పిల్లల విధానాన్ని 2016 నుంచి అమల్లోకి తెచ్చారు. దానివల్ల కూడా ప్రయోజనం లేదని అధికారులు తెలిపారు. 2018లో కొత్తగా జన్మించిన వారి సంఖ్య 20 లక్షల మేర పడిపోయింది. ఆ తర్వాత కూడా వరుసగా అది పడిపోతూ వస్తోంది. 2010లో చైనా జనాభా 134 కోట్లుగా ఉంది. వార్షిక వృద్ధి రేటు 0.57గా ఉంది. అంతకుముందు దశాబ్దంలో అది 1.07గా ఉండేది.
ఇదీ చదవండి: 2024 అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు!
ఇదీ చదవండి: నేపాల్లో ముగ్గురు రష్యా పర్వతారోహకులు గల్లంతు