ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ మూలాలపై చైనా యూ టర్న్ తీసుకున్నట్టు కనపడుతోంది. అందరూ విశ్వసిస్తున్నట్టు.. కరోనా వైరస్ మూలాలకు వుహాన్‌లోని మార్కెట్‌తో సంబంధం ఉండకపోవచ్చని బీజింగ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌కు అనేక మూలాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ మేరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీలో కథనం ప్రచురితమైంది.
"చైనా శాస్త్రవేత్తలు కొత్త కరోనా వైరస్ మూలాలను కనుగొన్నారు. వుహాన్‌లోని హూనాన్ సీ ఫుడ్ మార్కెట్‌తో సంబంధం ఉన్న రోగులకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. వుహాన్‌లో వైరస్ పుట్టి ఉండకపోవచ్చని చెప్పడానికి ఈ కొత్త ఆధారాలే సాక్ష్యం."
-- పీపుల్స్ డైలీ.
ఈ సరికొత్త సిద్ధాంతం ప్రకారం... జనవరి 20-ఫిబ్రవరి 25 మధ్యలో షాంఘైకు చెందిన 326మంది బాధితుల నుంచి వైరస్ జీనోమ్ నమూనాలను సేకరించారు శాస్త్రవేత్తలు. వీటిలో రెండు ప్రధాన క్లేడ్ను గుర్తించారు. ఈ రెండింటికీ.. డిసెంబర్లో వెలుగు చూసిన కేసులతో సంబంధం ఉంది. వీటిలోని ఒక క్లేడ్‌లో ఆరుగురు రోగులకు వుహాన్ మార్కెట్‌తో సంబంధం ఉన్నట్టు తేలింది. మరో క్లేడ్లోని ముగ్గురు రోగులకు మాత్రం అసలు మార్కెట్‌తో సంబంధం లేదు.
అన్నిటిలాగే వుహాన్‌లోని మార్కెట్ కూడా వైరస్ బాధిత ప్రాంతమేనని.. కరోనా పుట్టుక అక్కడ జరిగి ఉండకపోవచ్చని చైనాలోని రోగ నియంత్రణ, నిరోధక కేంద్రం(సీడీసీ) డైరక్టర్ గావ్ ఫు తెలిపారు. జనవరి నెలలో తాను వుహాన్‌కు స్వయంగా వెళ్లి నమూనాలను సేకరించినట్టు పేర్కొన్నారు. అక్కడి జంతువుల నమూనాల్లో వైరస్ కనపడలేదని.. కేవలం వాతావరణం, మురుగు నీటిలో వెలుగుచూశాయన్నారు.
అయితే ఇదివరకు చైనాలో జరిగిన పరిశోధనలే... వుహాన్ మార్కెట్‌తో వైరస్ మూలాలకు సంబంధం ఉందని తేల్చాయి. కానీ వీటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ ప్రాణాంతక మహమ్మారి బయటపడిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు అనేక ఐరోపా దేశాలు వైరస్ పుట్టుకపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశాయి