కొవిడ్-19 (కరోనా).. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మహమ్మారి. చైనాలో వేగంగా వ్యాపిస్తూ వందల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. వేల మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.
గురువారం ఒక్క రోజునే 121 మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల మొత్తం మృతుల సంఖ్య సుమారు 1500లకు చేరుకుందని ఆ దేశ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. తాజాగా మరో 5,090 మందికి వైరస్ సోకిన కారణంగా మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 65,000లకు చేరినట్లు వెల్లడించింది.
కరోనా వెలుగులోకి వచ్చిన హుబే రాష్ట్రంలో గురువారం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 4,823 మందికి వైరస్ సోకింది. హేయిలాంగ్జియాంగ్లో ఇద్దరు, అన్హూయ్, హెనాన్, చాంగ్కింగ్ రాష్ట్రాల్లో ఒకరి చొప్పున మరణించారు.
చైనాకు అంతర్జాతీయ మిషన్..
వైరస్‌ను గుర్తించేందుకు నూతన పద్ధతిని అనుసరిస్తున్న క్రమంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) పేర్కొంది. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు చెందిన 15 మంది సభ్యుల బృందం చైనాలో పర్యటిస్తోంది. ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ మిషన్ ఈ వారం చివర్లో చైనాకు వెళ్లే అవకాశం ఉందని ఆ సంస్థ అధినేత మైఖేల్ ర్యాన్ తెలిపారు.
ఇదీ చూడండి: ఇరాన్‌పై ట్రంప్ సైనికాధికారాలకు సెనేట్ అడ్డుకట్ట!