చంద్రుడి నుంచి మట్టి, రాళ్లను సేకరించి భూమికి రప్పించేందుకు చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక మంగళవారం విజయవంతంగా జాబిల్లి ఉపరితలంపై దిగింది. ఎంపిక చేసిన ప్రాంతంలో అత్యంత కచ్చితత్వంతో అది కాలు మోపిందని చైనా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
చైనా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలన్నింటిలో ఇది అత్యంత సంక్లిష్టమైంది. రెండు రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై డ్రిల్లింగ్ చేస్తుంది ఛాంగే-5. 2 కిలోగ్రాముల(4.4పౌండ్లు) రాళ్లు, వ్యర్థాలను సేకరిస్తుంది. తిరిగి కక్షలోకి చేరి.. అప్పటికే అక్కడ ఉండే ఓ క్యాప్సూల్లో ఈ పదార్థాలను పెడుతుంది. ఈ క్యాప్సూల్.. ఈ నెల మధ్య వారంలో తిరిగి భూమికి చేరుకుంటుంది.
చైనా ప్రయత్నం సఫలమైతే.. 1970ల తర్వాత చంద్రుడిపై ఉన్న రాళ్లను శాస్త్రవేత్తలు పొందగలిగిన ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. అయితే ఈ నమూనాలను ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కూడా పంచుకోనున్నట్టు చైనా వెల్లడించింది. చంద్రుడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని చైనా ఆశిస్తోంది.
చంద్రమండలంపైకి మానవసహిత యాత్రను నిర్వహించేందుకు ఈ మిషన్ దోహదపడుతుందని చైనా భావిస్తోంది.