కరోనా కేంద్రబిందువైన చైనాలో రెండు రోజులుగా వైరస్ కేసులు నమోదు కాలేదు. ఫలితంగా వైరస్ నియంత్రణలో కీలక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను, అనుభవాలను ఇతర దేశాలతో పంచుకోనుంది చైనా. ఈ మేరకు ఓ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. ఇందులో భారత్ సహా ఆసియాకు చెందిన 10 దేశాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు భారత్‌లో చైనా రాయబారి సన్ వీయిడాంగ్ ప్రకటన చేశారు.
వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సన్నిహత పొరుగుదేశాలకు సోదరభావంతో అవగాహన కల్పించేందుకే ఈ ఏర్పాటు చేయనున్నట్లు వీయిడాంగ్ స్పష్టం చేశారు.
విదేశాంగ కార్యదర్శి ఫోన్ సంభాషణ
కరోనా నియంత్రణకు సమైక్యంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇండో-పసిఫిక్ దేశాల విదేశీ వ్యవహారాల ప్రతినిధులతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కరోనా అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ కార్యదర్శి స్టీఫెన్ బీగన్ ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలైన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, వియత్నాం, న్యూజిలాండ్, జపాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ దేశ అనుభవాలు, తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి