తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా ముందడుగు వేస్తే... అందుకు సరైన ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరించింది.
"600 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధ డ్రోన్లను తైవాన్‌కు ఇస్తే... అది చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుంది. చైనా సార్వభౌమాధికారాన్ని కూడా దెబ్బతీసేందుకు యత్నించినట్లు అవుతుంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అమెరికాపై మండిపడ్డారు. చైనా-అమెరికా సత్సంబంధాలు మరింత క్షీణించకుండా ఉండాలంటే అగ్రరాజ్యం వెంటనే ఈ చర్యను ఆపేయాలని వాంగ్ హితవు పలికారు.
చైనా ఆంక్షలు విధించిన తర్వాతే...
నాలుగు 'వెపన్స్ రెడీ' డ్రోన్లను తైవాన్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం అమెరికా తెలిపింది. ఈ ఆయుధాల అమ్మకం... అమెరికా జాతీయ, ఆర్థిక, భద్రతా అంశాలకు బలం చేకూరుస్తుందని పేర్కొంది.
గత వారం కూడా తైవాన్‌కు 2.37 బిలియన్ల విలువైన హార్పూన్ క్షిపణులు విక్రయించేందుకు అమెరికా సిద్ధమైనట్లు పేర్కొంది. అమెరికా ఆయుధ తయారీ సంస్థలైన బోయింగ్, హార్పూన్పై చైనా విధించిన ఆంక్షలకు ప్రతిచర్యగా అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది.