చైనాలో కలకలం సృష్టిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 425 మంది మరణించారు. 20 వేలకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయని డ్రాగన్ దేశ అధికారులు వెల్లడించారు. హాంకాంగ్‌లోనూ కరోనా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది చైనా ప్రభుత్వం. ఈ ఆసుపత్రిలో సోమవారం నుంచి చైనా ఆర్మీకి చెందిన వైద్య బృందాలు సేవలందిస్తున్నాయి. 1,500 పడకల సామర్థ్యం కలిగిన రెండో ఆసుపత్రిని కూడా సిద్ధం చేస్తోంది చైనా ప్రభుత్వం.
చైనాలో ఉన్న తమ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లేందుకు ఇతర దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే నమోదైన వేలాది కేసులకు పరీక్షలు నిర్వహించడంలో జాప్యం జరుగుతున్నందున బాధితుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలే..
అధ్యక్షుడు జిన్‌పింగ్ నేతృత్వంలో వైరస్ నిర్మూలనపై రెండోసారి సమావేశమైన చైనా అధికార యంత్రాంగం కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించినట్లు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కాలంతో పోరాడాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పర్యవేక్షణలో..
మరోవైపు దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌కు సంబంధించి 15 కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చైనాను సందర్శించిన 800 మంది సైనికులు, వ్యక్తులు, వారితో సంబంధమున్న వారిని పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో నష్టాలు
చైనా స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ భయాలు పట్టి పీడిస్తున్నాయి. వరుస సెలవుల తరువాత తెరుచుకున్న స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజీలు నిన్న భారీ నష్టాలతో ముగిశాయి.