China Vaccine Booster Dose: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ బూస్టర్ డోసు పంపిణీపై ఆయా దేశాలు దృష్టి సారించాయి. ఇదే సమయంలో ఇవి కొత్త వేరియంట్ల నుంచి ఏ మేరకు రక్షణ కల్పిస్తాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ తయారు చేసిన టీకాను మూడు డోసుల్లో ఇచ్చినప్పటికీ ఒమిక్రాన్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో విఫలమవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సినోవాక్ టీకా విస్తృత వినియోగంలో ఉంది. ముఖ్యంగా చైనాతోపాటు థాయిలాండ్, ఇండోనేసియావంటి దేశాల్లో భారీగా పంపిణీ చేస్తున్నారు. దాదాపు 230కోట్ల డోసులను ఉత్పత్తిచేసిన సినోవాక్ చైనాలో అత్యధికంగా పంపిణీ చేయడంతోపాటు వివిధ దేశాలకు కూడా సరఫరా చేశారు. అయితే, ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు ఇచ్చి పరీక్షించగా ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడం లేదని తేలింది. దీంతో బూస్టర్ డోసుగా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇచ్చి ప్రయోగించారు. దీంతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించారు. ఈ పరిశోధనలను యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌తోపాటు చైనీస్ యూనివర్సిటీ హాంకాంగ్ కలిపి చేపట్టాయి.
Sinovac Vaccine:
తాము అభివృద్ధి చేసిన సినోవాక్ మూడు డోసులను తీసుకున్న 94 శాతం మందిలో వైరస్‌ను తటస్థీకరించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ఆ సంస్థ ఇటీవలే వెల్లడించింది. కానీ, ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదే సమయంలో రెండు డోసులతో మాత్రం ఒమిక్రాన్‌ను ఎదుర్కోలేమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ హుయ్ వెల్లడించారు. బూస్టర్ డోసు తీసుకునేందుకు హాంకాంగ్ అధికారులు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు అక్కడి అధికారులను కలవరపెడుతున్నాయి.
అయితే, కొవిడ్-19 కట్టడికి చైనా కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఒమిక్రాన్‌పైనా ఆందోళన చెందుతోంది. తాజాగా చైనాలో పెద్ద నగరాల్లో ఒకటైన జియాన్‌లో నిరవధిక లాక్‌డౌన్ విధించింది. 1.3కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్న చైనా అధికారులు.. అత్యవసరమైతే తప్ప ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. ఇలాంటి సమయంలో బూస్టర్ డోసు ఇచ్చినా రక్షణ తక్కువేనని తేలడం చైనాకు ఓ సవాలేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 260కోట్ల డోసులను పంపిణీ చేయగా.. వాటిలో అత్యధికం సినోవాక్‌వే కావడం గమనార్హం. ఇక ప్రయోగాల ఫలితాలను కూడా బాహ్య ప్రపంచానికి వెల్లడించని చైనా టీకాల పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:
Covid Vaccination For Children: చిన్నారులకు టీకాలు సురక్షితమేనా..?
కరోనా చికిత్సకు తొలి ట్యాబ్లెట్- వైరస్‌పై గెలుపు ఇక సులువయ్యేనా?