అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్న తరుణంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్, ఆ దేశ ప్రముఖ ఆర్థిక వేత్త లీ కెకియాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సరైన రీతిలో నియంత్రించుకోవాలని ఉద్ఘాటించారు. దీనితో పాటు ఒకరి ఆసక్తులను మరొకరు గౌరవించుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు హానీ కలిగిస్తే ఎవరికీ మంచిది కాదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చైనా పార్లమెంట్ సమావేశాల ముగింపు అనంతరం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ విజృంభణలో చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ అనేకమార్లు ఆరోపణలు చేశారు. ఈ ప్రభావం ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపైనా పడింది.
అమెరికా-చైనా మధ్య సంబంధాలు దిగజారాయని లీ అంగీకరించారు. ప్రచ్ఛన్న యుద్ధం వంటి పరిస్థితులను చైనా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల సామాజిక వ్యవస్థ, చరిత్ర వేరువేరు అని.. అందువల్ల వాటి మధ్య విభేదాలు ఏర్పడటం సహజమని అభిప్రాయపడ్డారు.
"ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో ముఖ్యం. చైనా-అమెరికా మధ్య విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. సహకరించుకుంటే.. చైనా-అమెరికాలు లాభపడతాయి. లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇరు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలి. సమానత్వంతో సంబంధాలు అభివృద్ధి చేసుకోవాలి. అది ప్రపంచానికి మంచిది."
--- లీ కెకియాంగ్, చైనా ప్రీమియర్