కరోనా వైరస్‌తో చైనా అతలాకుతలమవుతోంది. వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య పోరాడుతుంటే.. మిగిలిన వారు ఇళ్లకే పరిమితమయ్యారు. అటు బయటకు వెళ్లలేక, ఇటు ఇంట్లో భయంతో బిక్కుబిక్కుమంటూ జీవినం సాగిస్తున్నారు. కొందరు నిత్యావసర వస్తువులైనా కొనుక్కునే వీలు లేక దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి గడ్డు సమయంలో చైనీయులకు 'మేమున్నాం' అంటూ ముందుకు వచ్చాయి ఆ దేశ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. వైరస్‌ను లెక్కచేయకుండా తమ సేవలతో వినియోగదారుల కడుపు నింపుతున్నాయి.
వైరస్ నేపథ్యంలో జేడీ.కామ్ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మాస్కులు ధరించి ఇంటింటికీ తిరిగి ఆహార పదార్థాలను అందిస్తున్నారు డెలివరీ బాయ్స్.
"మా కోసం వీళ్లు చాలా కష్టపడుతున్నారు. వీరి సేవలు లేకపోతే మేము బతికి ఉండే వాళ్లమే కాదు."
-- వాంగ్, వినియోగదారుడు.
వారానికి రెండు-మూడు సార్లు ఈ సంస్థలనే ఆశ్రయిస్తున్నారు చైనావాసులు. కూరగాయలు, పండ్లు వంటివి కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల భయాన్ని అర్థం చేసుకున్న డెలివరీ బాయ్స్.. పార్శిళ్లను వారి చేతులకు ఇవ్వడం లేదు. ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలంలో పెట్టి వెళ్లిపోతున్నారు.
జేడీ...
దాదాపు 1,80,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థ జేడీ.. డిమాండ్‌ను అందుకునేందుకు అదనంగా మరో 20వేల మందిని పనిలోకి తీసుకుంటోంది. ఒక్కో డెలివరీ బాయ్.. రోజుకు 150-190 డెలివరీలు ఇస్తున్నాడు.
ఆహార పదార్థాలకు ఎలాంటి క్రిములు అంటకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డెలివరీ సంస్థలు స్పష్టం చేశాయి.