కరోనాపై పోరాడి అమరులైన వారికి గుర్తుగా శనివారం సంతాపదినంగా ప్రకటించింది చైనా. కరోనా వైరస్ను మొదటగా గుర్తించి.. అనంతరం అదే మహమ్మారికి బలైన డాక్టర్ లీ వెన్లియాంగ్నూ స్మరించుకున్నారు ఆ దేశ ప్రజలు. ఆయనతో పాటు కరోనా బారిన పడి మృతి చెందిన 3,300 చైనీయులకు సంతాపం తెలిపారు.
3 నిమిషాల పాటు మౌనం..
దేశవ్యాప్తంగా చైనా ప్రజలు కరోనా బాధితుల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ.. శనివారం ఉదయం 3 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సమయంలో వైమానిక దాడిలో ఉపయోగించే సైరన్లు, వాహనాలు, రైళ్లు, ఓడల హారన్లను మోగించారు. ఫలితంగా రోడ్లపై వాహనాలు కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
చైనాలో 3 వేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అధికారిక లెక్కల ప్రకారం వైద్యులతో సహా సిబ్బందిలో 10 మంది చనిపోయారు. ఇందులో కరోనాను తొలుత గుర్తించిన కంటి వైద్యులు లీ వెన్లియాంగ్ కూడా ఉన్నారు.
ఇదీ చూడండి: వైద్యుల సహృదయం.. రోగికి పుట్టినరోజు వేడుకలు