దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్ ఉండటం చైనాలో మరోసారి కలకలం సృష్టించింది. భారత్‌కు చెందిన బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్‌ను గుర్తించడం వల్ల ఆ కంపెనీ దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆంగ్ల వార్త సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. గడ్డకట్టించిన కటిల్‌ఫిష్ ప్యాకేజీలోని మూడు శాంపిల్స్‌లో వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని ఆ కథనం పేర్కొంది. దీంతో వారం పాటు దిగుమతులు నిలిపివేశారని తెలిపింది.
ఇటీవల ఇండోనేషియాకు చెందిన పీటీ అనురాగ్ లౌట్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లోనూ చైనా కస్టమ్స్ అధికారులు వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ కంపెనీ దిగుమతులను కూడా వారం పాటు నిలిపివేశారు. గత నెల బ్రెజిల్, ఈక్వెడార్, రష్యా దేశాల నుంచి చైనాకు వచ్చిన ఆహార పదార్థాల్లోనూ వైరస్ జాడ ఉన్నట్లు తేలింది.
కరోనా నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను చైనా పరీక్షీస్తోంది. అలా గత నెల ఈక్వెడార్ నుంచి దిగుమతైన రొయ్యలు, బ్రెజిల్ నుంచి వచ్చిన చికెన్ వింగ్స్ ఉత్పత్తులను పరీక్షించగా.. వ్యాధికారక వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో అప్పట్లో కూడా దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇదీ చూడండి: కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్