ఓవైపు కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్(Wuhan Lab) నుంచే లీకైందా అనే విషయంపై అగ్రరాజ్యం అమెరికా దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు చైనా మాత్రం ఆ ల్యాబ్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ గతవారం మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ ల్యాబ్‌లోనే వైరస్ పుట్టి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారిపై ఆయన ధ్వజమెత్తారు. కరోనాను తొలుత వుహాన్‌లో గుర్తించినంత మాత్రాన.. అది అక్కడే ఉద్భవించిదనడం సరికాదన్నారు. వుహాన్ ల్యాబ్‌లోనే వైరస్‌ను తయారు చేశారని, పొరపాటున అది బయటకు వచ్చిందనే ఊహాజనిత కథనాలను లిజియాన్ కొట్టిపారేశారు.
" కొవిడ్-19 జన్యు క్రమాన్ని చైనా శాస్త్రవేత్తలు తొలుత గుర్తించారు. అంతమాత్రాన వైరస్‌కు మూలం వుహానే అనడం సరికాదు. చైనా శాస్త్రవేత్తలే వైరస్‌ను తయారు చేశారనడంలో అర్థం లేదు " అని లిజియాన్ అన్నారు.
అంతేగాక వుహాన్ శాస్త్రవేత్తల బృందం కరోనాపై చేస్తున్న పరిశోధనలకు వైద్యం రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వాలని లిజాయాన్ అన్నారు. వారిపై నిందలు మోపొద్దన్నారు.
కొవిడ్-19పై చేసిన పరిశోధనలకు గానూ వుహాన్ ల్యాబ్‌ను చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అవార్డుకు నామినేట్ చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్ప్ ఆదివారం తెలిపింది.
వాల్ స్ట్రీట్ నివేదికతో..
వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో కరోనాను వుహాన్ ల్యాబ్(Wuhan Lab) లోనే సృష్టించారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక మంది ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు శాస్త్రవేత్తలు, నిపుణులు ఖండించారు. ఆ అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే గత నెలలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంతో ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. చైనాలో కరోనా తొలి కేసు గుర్తించడానికి నెల రోజుల ముందే వుహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ కథనం ప్రచురించినట్లు పేర్కొంది. అనంతరం కొద్ది రోజులకే కరోనా వైరస్ మూలాన్ని గుర్తించాలని జో బైెడెన్ నిఘా వర్గాలను ఆదేశించారు. ఇందుకు 90 రోజుల గడువిచ్చారు.
అయితే వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కథనం వచ్చినంత మాత్రాన ఈ విషయాన్ని విశ్వసించడం సరికాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇరాక్ యుద్ధ సమయంలోను అక్కడ సమూహిక వినాశక ఆయుధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించిందని, కానీ అందులో వాస్తవం లేదని గుర్తు చేశారు.