ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే క్షిపణిని (China Hypersonic Missile test) పరీక్షించినట్లు వచ్చిన వార్తలను చైనా ఖండించింది. తాము హైపర్‌సోనిక్ వాహనాన్ని మాత్రమే పరీక్షించామని, అది హైపర్ సోనిక్ మిసైల్ (China Hypersonic missile) కాదని స్పష్టతనిచ్చింది. ఈ విషయంపై మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్.. ఇది సాధారణ అంతరిక్ష వాహన పరీక్షేనని వివరించారు. అంతరిక్షం నుంచి మనుషులను తక్కువ ఖర్చుతో తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు.
"ఆగస్టులో చేపట్టిన ప్రయోగం వాహనానిదే, మిసైల్ (China Hypersonic Missile test) కాదు. చాలా దేశాలు, సంస్థలు ఇదే తరహా పరీక్షలను చేపడుతున్నాయి. మేం చేసిన ప్రయోగం తాలూకు వాహన విడిభాగాలు.. సముద్రంలో పడిపోయాయి. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఈ ప్రయోగం మానవాళికి ఉపకరిస్తుంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకునేలా ప్రపంచ దేశాలతో కలిసి చైనా పనిచేస్తుంది."
-ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్ క్షిపణిని చైనా పరీక్షించిందని పాశ్చాత్య మీడియాలో కథనాలు (China Hypersonic Missile news) వెలువడ్డాయి. ఈ పరీక్ష ఆగస్టులోనే జరిగిందని... చైనా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచిందని అధికారులు పేర్కొన్నారు. ఇది కొద్దిలో గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్ చాలావరకు పట్టు సాధించినట్లు తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో చైనా పురోగతి అమెరికా నిఘా వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తిందని వివరించారు.
అసలు ఏమిటీ ఆయుధం? దీని వల్ల అమెరికాకు నష్టమేంటి? ఇలాంటి ఆయుధాలు ఏఏ దేశాల వద్ద ఉన్నాయనే విషయాలు తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: భారత్- అమెరికా సైనికుల కబడ్డీ.. మంచులో సందడి