భారత్తో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలు ద్వైపాక్షిక అంశమని చైనా ఉద్ఘాటించింది. ఈ సమస్యను ఆసరాగా తీసుకుని హిందూ పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయొద్దని అమెరికాను సూచించింది. హిందూ పసిఫిక్ వ్యూహాన్ని ఆపేయాలని అగ్రరాజ్యాన్ని కోరింది.
భారత్తో రక్షణ సంబంధాల బలోపేతానికి అమెరికా చేస్తోన్న ప్రయత్నాలను ఉద్దేశించి చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఈ మేరకు మీడియా ప్రకటన చేశారు.
"భారత్- చైనా సరిహద్దు వ్యవహారాలు ద్వైపాక్షిక అంశం. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఆయా సమస్యల పరిష్కారానికి రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. హిందూ పసిఫిక్ వ్యూహంతో పాత కాలం నాటి ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా ప్రయత్నిస్తోంది. తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంక్షిస్తోంది. ఇది ఈ ప్రాంతంలోని సాధారణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. దీన్ని ఆపాలని అమెరికాను కోరుతున్నాం."
- వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
పాంపియో పర్యటన..
దిల్లీలో జరిగిన భారత్, అమెరికా 2+2 చర్చల్లో భాగంగా మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చంపడంపై చైనాను తీవ్రంగా విమర్శించారు. భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే చర్యలను ఎదుర్కోవటంలో మద్దతుగా నిలుస్తామని పాంపియో హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: భారత్-అమెరికా మధ్య కుదిరిన బెకా ఒప్పందం