సామాజిక మధ్యమాలను హ్యాక్ చేసి లైక్‌లు కొట్టడం, నకిలీ ఖాతాల నుంచి అనుచిత పోస్టులు పెట్టడం ఈ మధ్య కాలంలో చాలా వార్తలు విన్నాం. తాజాగా ఇలాంటి ఓ చేదు అనుభవం బ్రిటన్‌లోని చైనా రాయబారికి ఎదురైంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
లైక్‌లు కొట్టారు..
చైనా రాయబారి లీ షియామింగ్ అధికారిక ఖాతా నుంచి ఓ అశ్లీల చిత్రాల సైట్‌కు చెందిన పోస్టుకు.. లైక్ కొట్టినట్లు గమనించారు ఓ సామాజిక కార్యకర్త. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను బుధవారం సోషల్‌మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అనంతరం స్పందించిన చైనా.. రాయబారి అకౌంట్ హ్యాక్ అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది బ్రిటన్‌లోని చైనా రాయబార కార్యాలయం.
" చైనా వ్యతిరేక వ్యక్తులు.. చైనా రాయబారి లీ షియామింగ్ ఖాతాను హ్యాక్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మా కార్యాలయం నుంచి ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థకు తెలియజేశాం. ఈ విషయంపై పక్కాగా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం."
-- బ్రిటన్‌లోని చైనా రాయబార కార్యాలయం
ఈ అంశంపై ట్విట్టర్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం రాయబారి షియామింగ్ అధికారిక ట్విట్టర్లో రెండు లైక్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. అవీ తను చేసిన పోస్టులకే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను చైనాలో నిషేధించారు. అక్కడ ట్విట్టర్ తరహాలోనే విబో అనే ప్లాట్‌ఫాం ఉంది. అయితే చైనా అధికారులు, ముఖ్యంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని వ్యక్తులు.. చైనా అధికారిక సమాచారం, మానవ హక్కులు, విదేశాంగ విధానం, ఇతర అంశాలపై మాట్లాడటానికి ట్విట్టర్‌ను వినియోగిస్తున్నారు.