కొంతకాలంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని చైనా వుహాన్‌లో వరుసగా రెండో రోజు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆర్థిక పునరుద్ధరణ చర్యల్లో నిమగ్నమైన జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని ఈ పరిణామం కలవరానికి గురిచేస్తోంది.
వుహాన్‌లో 35 రోజుల తర్వాత ఆదివారం ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన కాలనీ వర్కింగ్ కమిటీ కార్యదర్శిని పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం. అయితే, సోమవారం కొత్తగా నమోదైన 16 కేసుల్లో 15 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలింది. ఇలాంటి కేసుల వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వుహాన్‌లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కరోనా సోకిన 760 మందిలో 606 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ, వుహాన్, హుబే రాష్ట్రం, షులన్లలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. వుహాన్‌లో రెండు ప్రాంతాల్లో కరోనా కేసులు వచ్చినంత మాత్రాన కరోనా 2.0 వస్తోందని పొరపడొద్దని చైనా వైద్య నిపుణులు భరోసా ఇచ్చారు.
కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడం వల్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్ రాష్ట్రంలోని షులన్ నగరంలో లాక్డౌన్ విధించింది.
ఇదీ చదవండి:'సైన్స్ ఫిక్షన్ సీన్‌ను తలపిస్తున్న విమాన ప్రయాణం'