ఏప్రిల్ 8న లాక్‌డౌన్ ఎత్తి వేసి.. దాదాపు సాధారణ స్థితికి చేరుకున్న చైనా వుహాన్లో కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా నగరంలో మరో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 8 మందికి కొవిడ్ లక్షణాలు కనిపించకుండానే వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. నగరంలోని మొత్తం జనాభా ఒక కోటి పది లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో సగం మందికి పైగా ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. దీంతో, వారిద్వారా ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇప్పటివరకు వుహాన్లోనే లక్షణాలు కనిపించకుండా 598 కేసులు నమోదయ్యాయి. అందుకే నగరంలో 10 రోజుల పాటు ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం.
ప్రస్తుతం చైనాలో మొత్తం కేసుల సంఖ్య 82,926కు చేరింది. మృతుల సంఖ్య 4,633గా ఉంది.
ఇదీ చదవండి:'20 ఏళ్లలో చైనా నుంచి 5 మహమ్మారులు'