కరోనా సంక్షోభంలోనూ చైనా ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధి రేటును నమోదు చేసింది. కొవిడ్ నుంచి త్వరగానే కోలుకున్న చైనా ఆర్థిక వ్యవస్థ గతేడాది 2.3 శాతం వృద్ధి చెందింది. ఈ మేరుకు చైనా జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌బీఎస్) వివరాలను వెల్లడించింది. అయితే గడిచిన 45ఏళ్లలో చైనా ఇంత తక్కువ వృద్ధిరేటు నమోదు చేయడం ఇదే తొలిసారి.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా పాజిటివ్ వృద్ధి రేటును సాధించినా.. మిగతా దేశాల అభివృద్ధి సూచీలు మందగమనంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఎన్‌బీఎస్ ప్రకారం... గతేడాదికి గానూ చైనా స్థూల దేశీయోత్పత్తి 15.42 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. లాక్‌డౌన్ కారణంగా 2020 తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 6.8శాతం తగ్గింది. కానీ, రెండో త్రైమాసికానికి వచ్చేసరికి మళ్లీ గాడినపడింది. అదే సమయంలో కరోనా ప్రపంచమంతా పాకి మహమ్మారిగా మారింది. ఈ సమయంలో పలు ప్రపంచ దేశాలు నెగటివ్ వృద్ధి రేటును నమోదు చేశాయి.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న సమయంలో చైనా స్థిరంగా కోలుకుంది. మూడో త్రైమాసికంలో జీడీపీ 4.9శాతం, నాలుగో త్రైమాసికంలో 6.5శాతం వృద్ధిచెందడం గమనార్హం. తయారీ, ఎగుమతులూ పెరిగాయి. ఆ దేశ ఉద్యోగ మార్కెట్ కూడా మెరుగుపడింది. గతేడాది చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 11.86 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది.
2020లో ఆర్థిక వృద్ధి సాధించిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ చైనానే అని ఎన్‌బీఎస్ సారథి నింగ్ జిజే అన్నారు.
ఇదీ చదవండి : హవాలా రాకెట్: ఈడీ కస్టడీకి ఇద్దరు చైనీయులు