చైనా 'కరోనా' వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు 17 మంది ఈ వైరస్ కారణంగా బలయ్యారు. మరో 570 మందికిపైగా సోకగా.. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ అంతుచిక్కని సూక్ష్మజీవి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
వుహాన్లో పుట్టుకొచ్చిన కరోనా.. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 11 మిలియన్ల జనాభా ఉన్న వుహాన్లో.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. విమానాలు, రైళ్లను నిరవధికంగా నిలిపివేశారు.
హ్యుంగ్యాంగ్లోనూ...
సుమారు 75 లక్షల జనాభా ఉన్న హ్యుంగ్యాంగ్ నగరంలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వుహాన్కు 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న హ్యుంగ్యాంగ్పై ఈ వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉందన్న అనుమానంతో అధికారులు చర్యలు చేపట్టారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ అర్ధరాత్రి నుంచి నగరానికి రాకపోకలు నిలిపివేశారు. హ్యుంగ్యాంగ్కు వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. మద్యం దుకాణాలు, సినిమా హాళ్లు, ప్రధాన మార్కెట్లు, అంతర్జాల కేంద్రాలను మూసివేశారు.
సమీపంలోని మరో ప్రధాన నగరం.. ఇఝౌ రైల్వే స్టేషన్నూ ఇప్పటికే తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు. కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తమైన ఆరోగ్య శాఖ తదుపరి ఏం చేయాలనే సమాలోచనలు జరుపుతోంది. వైరస్ను అరికట్టేదిశగా అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
టాక్సీ డ్రైవర్లకు...
ప్రజలను బయట తిరగవద్దని చైనాలోని ప్రభుత్వం హెచ్చరించిన దగ్గరనుంచి అక్కడి టాక్సీ డ్రైవర్లు పండగ చేసుకుంటున్నారు. ప్రయాణాలు చేసే ప్రజల దగ్గర నుంచి.. సాధారణ ఛార్జీల కంటే 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. 'బయట తిరగడం అత్యంత ప్రమాదమే అయినా.. డబ్బులు కావాలి కాబట్టి తప్పదు' అని అంటున్నారు డ్రైవర్లు. చైనా వాసులు.. మాస్కులు లేకుండా బయటకు రావడం లేదు.