చైనా విస్తరణ కాంక్ష మరోసారి బయటపడింది. భారత సరిహద్దుల్లోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్.. ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్‌ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ రైలును ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం లభిస్తుంది.
టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్‌చి ప్రాంతం వరకు ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలు సేవలను డ్రాగన్ శుక్రవారం ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు కోసం లాసా, నింగ్‌చి మధ్య 435.5 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను 2014లోనే చైనా ప్రారంభించింది. టిబెట్‌లో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. టిబెట్ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది. ఈ బుల్లెట్ రైలుతో సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డు నుంచి లాసా మధ్య ప్రయాణ దూరం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని డ్రాగన్ చెబుతోంది. ఈ ప్రాజెక్టుపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతేడాది నవంబరులో మాట్లాడుతూ.. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషించనుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా.. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు ఈ నింగ్‌చి నగరం అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతం వరకు చైనా బుల్లెట్ రైలును తీసుకురావడం గమనార్హం. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లోని భాగమని చైనా వితండవాదం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రూటు మార్చిన డ్రాగన్.. మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో భారత సరిహద్దులకు చేరువగా వచ్చే కుతంత్రాలు చేస్తోంది. హిమాలయ ప్రాంతంలోని నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం కావడంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరుతో వ్యూహాత్మకంగా అడగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బుల్లెట్ రైలు సేవలు తీసుకొచ్చింది.
ఇదీ చూడండి: కొవిడ్ మూలాలను గుట్టుగా 'చెరిపేస్తున్న' చైనా!