శాశ్వత మిత్రదేశం పాకిస్థాన్ కోసం అత్యాధునిక టైప్-054 యుద్ధనౌకలను తయారు చేస్తోంది చైనా. మొదటి దానిని షాంఘైలోని హుడోంగ్ ఝోంగ్వా నౌకాశ్రయంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. దీంతో రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఈ యుద్ధనౌకలో అత్యాధునిక ఉపరితల సాంకేతికతను ఉపయోగించి వాయు నిరోధక ఆయుధాలు, పోరాట నిర్వహణ వ్యవస్థలను రూపొందించినట్లు పాక్ మీడియా తెలిపింది.
రెండు టైప్-054 యుద్దనౌకల తయారీ కోసం 2017లో చైనా షిప్‌బిల్డింగ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్థాన్. అయితే వీటి ఖరీదు, షరతులకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
భారత్‌తో సరిహద్దులో వివాదం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు సైనిక సాయం అందిస్తూ శక్తిమంతమైన ఆయుధాలు సమకూర్చుతోంది చైనా. ఫలితంగా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాలని భావిస్తోంది.
పాక్‌కు చైనా ఇప్పటికే అణ్వాయుధ సహకారం, జేఎఫ్-17 యుద్ధ విమానాలు, ఏ-100 రాకెట్ లాంచర్లు, రెండు దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అల్ ఖలీద్ ట్యాంకర్లు, హెచ్‌క్యూ-16 క్షిపణులను సరఫరా చేస్తోంది. పొరుగు దేశంతో కలిసి భారత్‌ను దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తోంది.