ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా నిర్బంధ, దురాక్రమణ వైఖరి అనుసరిస్తోందంటూ అమెరికా, జపాన్ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ మండిపడింది. ఇరుదేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని హెచ్చరించింది.
అమెరికా, జపాన్ మంత్రుల కీలక సమావేశం టోక్యోలో మంగళవారం జరిగింది. ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణలకు పాల్పడుతోందని సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. చైనా మానవహక్కులను ఉల్లంఘిస్తోందని, దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా వైఖరి ప్రస్తుత అంతర్జాతీయ విధానానికి విరుద్ధంగా ఉందన్నారు.
అయితే ఈ ప్రకటనపై చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ స్పందించారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చటం ఆపేయాలని.. జపాన్, అమెరికా దేశాలకు హితవు పలికారు. చైనాను లక్ష్యంగా చేసుకుని చిన్న కూటములను ఏర్పాటు చేసుకోవటం మానుకోవాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విధానాలను శాసించే అధికారం అమెరికా, జపాన్లకు లేదన్నారు.
ఇదీ చదవండి : టాంజానియా అధ్యక్షుడు కన్నుమూత