అమెరికాలో త్వరలో కొలువుదీరే ప్రభుత్వం చైనా పట్ల వైఖరి మార్చుకుంటుందని డ్రాగన్ దేశం ఆశాభావం వ్యక్తం చేసింది. చైనాతో చర్చలను తిరిగి ప్రారంభించి, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చింది.
ఇటీవల ఊహించని సవాళ్లను ఎదుర్కొన్న చైనా-అమెరికా సంబంధాలు కొత్త కూడలి వద్దకు చేరుకున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. నూతన ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు. చైనాపై అమెరికాకు చెందిన కొందరు విధాన నిర్ణేతలు పెట్టుకున్న అపోహల వల్లే ఇదివరకు సమస్యలు తలెత్తాయన్నారు.
"కొందరు చైనాను తమకు అతిపెద్ద ముప్పుగా భావిస్తున్నారు. అది తప్పు. చైనాను అణచివేసి ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించేందుకు అమెరికా ప్రయత్నించిందన్న విషయాన్ని ఇదివరకు జరిగిన విషయాలు నిరూపిస్తున్నాయి. కానీ ఇది రెండు దేశాల ప్రయోజనాలకు హాని కలిగించడమే కాకుండా.. ప్రపంచం మొత్తానికి అవరోధాలు ఏర్పరిచింది. అలాంటి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి."
-వాంగ్ యీ, చైనా విదేశాంగ మంత్రి
మరోవైపు, అమెరికా పట్ల చైనా అనుసరించే విధానాల్లో ఎలాంటి మార్పు లేదని వాంగ్ యీ స్పష్టం చేశారు. అమెరికాతో.. సహకారం, సుస్థిరతతో కూడిన సంబంధాలను నెలకొల్పేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. చైనా సత్వర అభివృద్ధిని చూసి కొంతమంది అమెరికన్లు అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు. తమని తాము మెరుగుపర్చుకోవడం ద్వారానే తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవచ్చే కానీ, ఇతరుల అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: విభేదాల పరిష్కారానికి అమెరికాకు చైనా పిలుపు