రక్షణ బడ్జెట్‌ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. గతేడాది రక్షణ శాఖకు 17,500 కోట్ల డాలర్లు కేటాయించిన డ్రాగన్... ఈ ఏడాది 17,761 కోట్ల డాలర్లకు పెంచింది. ఇది భారత్ రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.
రక్షణ రంగానికి గతేడాది కంటే సుమారు 7.5 శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ (ఎన్పీసీ) పార్లమెంట్‌కు సమర్పించిన ముసాయిదా ప్రతిలో పేర్కొంది. ఇది కేవలం సైనిక సన్నద్ధత కోసం కాదని, దేశాభివృద్ధి సాధన కోసమని చెప్పింది.
చైనా సైనిక శక్తి...
ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన చైనా ప్రపంచ శక్తిగా ఎదగాలని కలగంటోంది. అందుకే ఇటీవల కీలక సంస్కరణలు చేపట్టింది. నావిక, వైమానిక దళాల పటిష్ఠానికి చర్యలు ప్రారంభించింది. పదాతి దళంలో మాత్రం 3లక్షల మంది జవాన్లను తగ్గించాలని నిర్ణయించింది.
అమెరికాకు చేరువలో
రక్షణ రంగానికి 2015 వరకు రెండు అంకెల శాతం మేర పెంచుతూ వచ్చిన చైనా... తరువాత నుంచి ఆ వృద్ధిని 10 శాతం లోపునకే పరిమితం చేస్తూ వస్తోంది. అమెరికా ఏటా రక్షణ శాఖకు 20 వేల కోట్ల డాలర్లు కేటాయిస్తుండగా, ఆ మొత్తానికి చైనా చేరువవుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలు బడ్జెట్లో దాదాపు 2 శాతం వరకు రక్షణ రంగానికి కేటాయిస్తున్నాయి. చైనా విషయంలో ఆ మొత్తం 1.3 శాతమే.