కరోనా మహమ్మారికి టీకా మందు కనిపెట్టేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ దేశం... మూడో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు ఓ పరిశోధన సంస్థకు అనుమతి ఇచ్చింది.
ఏప్రిల్ 23 నుంచే...
చైనా సైన్యానికి చెందిన వైద్య విభాగం ఇప్పటికే ఎడినోవైరస్ వెక్టార్ వ్యాక్సిన్‌ను శరవేగంగా తయారు చేస్తోంది. ప్రస్తుతం 500 మందిపై రెండోదశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. రెండో వ్యాక్సిన్‌పై వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూఐవీ) ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది.
మూడో వ్యాక్సిన్‌ను చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్(సినోఫార్మ్) ఆధ్వర్యంలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రోడక్ట్స్ తయారుచేస్తోంది. ఎంపిక చేసిన 96 మందిపై ఏప్రిల్ 23 నుంచి ట్రయల్స్ ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం మంచి ఫలితాలు వస్తున్నట్లు సినోఫార్మ్ తెలిపింది.
సాధారణ ప్రక్రియను అనుసరిస్తే వ్యాక్సిన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదటి వరకు రాదని చైనా వ్యాధి నియంత్రణ సంస్థ తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన ప్రయోగాలు చేపడుతున్నామని వెల్లడించింది.
రెండోదశ కేసులు..
చైనాలో కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు లేకుండా శనివారం మరో 12 మంది ఆసుపత్రుల్లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా 82 వేలు దాటగా.. మృతుల సంఖ్య 4,632కు చేరింది. ఇప్పటివరకు 77,346 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి: ఏడాది చివరిలోగా చైనా వైద్యులకు కరోనా వ్యాక్సిన్!