చైనాలో కరోనా కేసులు వెలుగులోకి రావడంపై జిన్‌పింగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. క్వింగ్డావోలో కొత్త కేసులు బయటపడగా.. ఆ నగరంలోని వైద్యాధికారులపై ఉక్కుపాదం మోపింది. క్వింగ్డావో థెరాసిక్ ఆస్పత్రి అధ్యక్షుడు డెంగ్ కై, హెల్త్ కమిషన్ డైరెక్టర్ సుయి ఝెన్హువాలను విధుల నుంచి బహిష్కరించింది. వారిని విచారణలో ఉంచినట్లు క్వింగ్డావో ప్రభుత్వ ఆస్పత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది.
క్వింగ్డావో నగరంలో ఇటీవల 12 కేసులు బయటపడ్డాయి. ఇందులో కొంతమందికి లక్షణాలు కూడా కనిపించలేదు. అయితే రెండు నెలల తర్వాత చైనాలో వైరస్ స్థానిక సంక్రమణం జరగడం ఇదే తొలిసారి. దీంతో నగరంలోని 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
రోగికి సన్నిహితంగా ఉన్నవారిని కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు క్వింగ్డావో వైద్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 80 లక్షల నమూనాలు పరీక్షించగా.. 50 లక్షల నమూనాల ఫలితాలు వచ్చాయని పేర్కొంది. ఇందులో ఎవరికీ పాజిటివ్‌గా నిర్ధరణ కాలేదని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ చైనాలో ఉద్భవించినప్పటికీ.. ప్రస్తుతం ఆ దేశంలో వైరస్ వ్యాప్తి దాదాపుగా ఆగిపోయింది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారి వల్లే దేశంలో కేసులు నమోదవుతున్నాయి. చైనాలో గురువారం 11 కేసులు నమోదయ్యాయి. అందులో 10 మంది విదేశాల నుంచి వచ్చినవారే. ప్రస్తుతం అక్కడ 240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ సోకిందని అనుమానిస్తున్న మరో 392 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి- తస్మాత్ జాగ్రత్త: పొగతాగేవారికి కరోనాతో అధిక ముప్పు