గల్వాన్ ఘటనలో మరణించిన సైనికుల వివరాలను చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. పలువురు మృతిచెందారని ఓ ప్రకటన విడుదల చేసిందే తప్ప.. ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ఈ విషయంపై సొంత ప్రజల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బ్రియట్బార్ట్ న్యూస్ నివేదించింది.
నివేదిక ప్రకారం.. ఘర్షణలో మరణించిన చైనా సైనికుల కుటుంబాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమ వారికి తగిన గౌరవం దక్కలేదని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై వైబో సహా ఇతర సామాజిక మాధ్యల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వారిని శాంతిపజేయడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఫలితం దక్కడం లేదు.
చైనా దుస్సాహసం..
మే నెల నుంచి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేయడానికి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించాలని ఇరు దేశాల నిర్ణయించాయి. అయితే చైనీయులు మాత్రం ఈ నెల 15న గల్వాల్ లోయలో భారత జవాన్లపై దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే.. 20మంది భారత జవాన్లు వీరమరణం పొందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఆ 20మందికి ఘనంగా వీడ్కోలు పలికారు ప్రజలు. కానీ చైనా మాత్రం.. మరణించిన తమ జవాన్ల వివరాలను వెల్లడించలేదు. అయితే గల్వాన్ ఘటనలో చైనావైపు 43మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది.
ఇదీ చూడండి:- సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!