చైనాకు చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించడాన్ని ఆ దేశం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.
యాప్‌ల నిషేధం.. అంతర్జాతీయ వ్యాపారం, ఈ-కామర్స్ నిబంధనలకు వ్యతిరేకమని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్ పేర్కొన్నారు. మార్కెట్లోని పోటీతత్వం, వినియోగదారుల ప్రయోజనాలకు ఇది భంగం కలిగిస్తుందని అన్నారు.
"భారత్ చర్యలు అస్పష్టమైనవి. కొన్ని చైనా యాప్‌లపై లక్ష్యంగా చేసుకొని ఉన్నాయి. పారదర్శకమైన విధానాలకు ఇది వ్యతిరేకంగా ఉంది. ఈ చర్యలు జాతీయ భద్రతా మినహాయింపులను దుర్వినియోగం చేసి, డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఉన్నాయి."
-జీ రోంగ్, భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి
చైనా విదేశాంగ కార్యాలయం సైతం ఈ విషయంపై స్పందించింది. ప్రభుత్వం జారీ చేసిన నిషేధాజ్ఞలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ నిబంధనలు, స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని చైనా ప్రభుత్వం ఎప్పుడూ తమ వ్యాపారులకు చెబుతుందని పేర్కొంది.
"చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. చైనా, భారత్ మధ్య పరస్పర సహకారంతో కూడిన బంధం ఉంది. భారత ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా.. ఈ చర్య కృత్రిమంగా చేపట్టారు."
-ఝావో లిజియాన్, చైనా విదేశాంగ ప్రతినిధి
యాప్‌లపై నిషేధం
చైనాకు చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐటీ చట్టం 69ఏ ప్రకారం ఈ అప్లికేషన్లను నిషేధిస్తున్నట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. దేశ సమగ్రత, రక్షణ, ప్రజల భద్రతకు చైనా యాప్‌లు విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది.
ఇవీ చదవండి