టిక్‌టాక్‌ను వాషింగ్టన్ దొంగతనంగా హస్తగతం చేసుకునేందుకు చైనా ఎంతమాత్రం అంగీకరించదని మంగళవారం ఆ దేశ మీడియా పేర్కొంది. టిక్‌టాక్ యాప్ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్ మీద అమెరికా ఒత్తిడి తీసుకువస్తోన్న నేపథ్యంలో.. చైనా తగిన విధంగా స్పందించగలదని హెచ్చరించింది.
చైనా కంపెనీల పట్ల వాషింగ్టన్ విధానాలు అవకాశవాదంగా ఉన్నాయని.. ఈ తీరుకు తలొగ్గడం లేదా సాంకేతికంగా ప్రమాదకర యుద్ధాల వైపునకు మొగ్గు చూపడం మినహా చైనాకు మరోదారి లేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. ఆ సంస్థను కుట్రపూరితంగా హస్తగతం చేసుకుంటే, తగిన విధంగా స్పందించడానికి చైనా వద్ద అనేక మార్గాలున్నాయని తెలిపింది.
భద్రతా కారణాలు చూపి టిక్‌టాక్‌ను అమెరికాలో పూర్తిగా నిషేధిస్తామని శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో సదరు యాప్ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు చర్చలు జరుగుతుండగా.. టిక్‌టాక్ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించాలని, లేకపోతే మూసివేయాలని హెచ్చరికలు చేస్తూ ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. అంతేకాకుండా వాటిని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడంపై తన ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదని వెల్లడించారు.
ఇవీ చూడండి: టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు!