కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనాపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. తొలినాళ్లలోనే వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా విఫలమైందని కొన్ని దేశాలు ప్రత్యక్షంగానే మండిపడుతున్నాయి. తాజాగా చైనా నిర్లక్ష్యానికి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. చైనా ప్రభుత్వానికి వైరస్ గురించి తెలిసినప్పటికీ.. తమ పౌరులను అప్రమత్తం చేయడంలో 6రోజులు(జనవరి 14-20) ఆలస్యం చేసిందని తెలుస్తోంది.
ఆలస్యానికి మూల్యం...
జనవరి నెలలో వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్‌లో ఎన్నో వేడుకలు జరిగాయి. వేలాది మంది వీటిలో పాల్గొన్నారు. దీంతో పాటు అప్పటికి మరికొద్ది రోజుల్లో జరగనున్న నూతన ఏడాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది చైనావ్యాప్తంగా పర్యటించారు.
అయితే 7వరోజు(జనవరి 20)న ప్రభుత్వం ప్రజలను తొలిసారిగా అప్రమత్తం చేసింది. కానీ అప్పటికే వైరస్ 3 వేల మందికి సోకింది. ఈ వివరాలను.. తమకు లభించిన అంతర్గత పత్రాలు, నిపుణుల విశ్లేషణల ఆధారంగా అంచనా వేసింది ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ.
ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదని చైనా అంత సమయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఇన్ని రోజుల సమయం తీసుకున్నట్టు కూడా చైనా చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు.
కానీ ఆ 6 రోజుల(జనవరి 14-20) ఆలస్యానికి మూల్యం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులు, లక్షకుపైగా మరణాలు.
"ఇది చాలా పెద్ద విషయం. ఆరు రోజుల ముందే చైనా తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసుంటే.. ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉండేవి. బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వైద్య సదుపాయలు సరిపోయేవి. వుహాన్ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలేది కాదు."
--- జుయో-ఫెంగ్ జాంగ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త.
ఇన్ని తప్పులా...?
ఆరు రోజుల ఆలస్యం ఒక్కటే చైనా చేసిన తప్పు కాదు. దేశంలో ఆరోగ్య వ్యవస్థలో అనేక లోపాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 5-17 మధ్య స్థానిక అధికారులు ఎలాంటి కేసులను రిపోర్టు చేయలేదని చైనా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం చెబుతోంది. అంతర్గత బులిటెన్లలోనూ ఇదే పరిస్థితి. కానీ అదే సమయంలో కొన్ని వందల మంది రోగులు ఆసుపత్రుల్లో రోజూ చేరారు. బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఒక్క వుహాన్‌లోనే కాదు.. చైనా అంతటా ఇదే పరిస్థితి.
అయితే ఇది స్థానిక అధికారుల తప్పిదమా.. లేక జాతీయ స్థాయిలో ఉన్న అధికారుల తప్పా అన్నది ఇంకా తెలియలేదు. అసలు ఆ సమయంలో అధికారులకు ఏం తెలుసనే అంశంపైనా అస్పష్టత నెలకొంది.
కానీ వైరస్‌ను అరికట్టలేని చైనా.. నిజమైన వార్తలను బయటకు పోకుండా నియంత్రించగలిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటి వల్లే తొలినాళ్లలో హెచ్చరికలు కూడా లేవని చెబుతున్నారు.
వైద్యులకు శిక్ష...
వీటితో పాటు చైనాలోని వైద్యులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణంతో జనవరి 2న 8 మంది వైద్యులను చైనా కఠినంగా శిక్షించింది. ఈ వార్తలు జాతీయ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి.
ఈ తరుణంలో జనవరి 13న థాయ్‌లాండ్‌లో తొలి కేసు నమోదైంది. అసలు ఎలాంటి సమాచారం లేని బీజింగ్ నేతలను ఈ వార్త పెద్ద షాక్‌కు గురిచేసింది. ఆ వెంటనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కేసులను గుర్తించడం కోసం జాతీయ స్థాయిలో ప్రణాళికలు రచించారు. వైద్యులకు కిట్లు పంపిణి చేశారు, రోగులకు స్క్రీనింగ్ నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేశారు. ఇవేవీ ప్రజలకు తెలియకుండానే జరిగాయి.
ఆ టెలికాన్ఫరెన్స్‌లో ఏం జరిగింది?
అయితే తమపై వస్తున్న ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. వైరస్ విజృంభణను వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతోంది.
ఈ పూర్తి వ్యవహారంపై దేశాధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని, ఉప ప్రధానులు.. హుబే రాష్ట్ర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిపింది. అనేక సూచనలు జారీ చేసినట్టు పేర్కొంది. అయితే ఎలాంటి సూచనలు చేశారనే దానిపై స్పష్టత లేదు.
ఈ టెలికాన్ఫరెన్స్‌కు సంబంధించిన మెమోలు ఫిబ్రవరిలో బాహిరంగమయ్యాయి. అయితే వీటిలోనూ కీలక అంశాల ఊసే లేదు. కానీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశముందని మెమోలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశముందని హెచ్చరించింది.
ఇదీ చూడండి:- గబ్బిలం కాదు.. వీధి కుక్క నుంచే కరోనా వ్యాప్తి!