అఫ్గాన్‌లో తాలిబన్ల(Afghanistan Taliban) ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా.. మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని(China Help Afghanistan) అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు వంటివి అఫ్గాన్‌కు సరఫరా చేసింది. ఇవి బుధవారం రాత్రి.. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయని(China Help Afghanistan) చైనా అధికారిక వార్తా సంస్థ 'జిన్హువా' వెల్లడించింది.
కాబుల్‌కు చేరుకున్న ఈ వస్తువులను అఫ్గానిస్థాన్‌కు చైనా రాయబారి వాంగ్ యూ, అఫ్గాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలోని శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి ఖలీల్-ఉర్-రెమహాన్ హక్కానీ.. విమానాశ్రయంలో అందుకున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య చైనా తక్కువ వ్యవధిలోనే అప్గాన్‌కు మానవతా సాయం కింద ఈ వస్తువులను అందజేసిందని వాంగ్ యూ చెప్పారు.
"శీతాకాలంలో అఫ్గాన్ ప్రజలకు ఉపయోగపడే బ్లాంకెట్లు, జాకెట్లు వంటివి అఫ్గాన్‌కు చైనా అందజేసింది. భవిష్యత్తులోనూ అప్గాన్‌కు ఆహారం సహా ఇతర వస్తువులను మేం సరఫరా చేస్తాం. అతి త్వరలోనే అవి అఫ్గాన్‌కు చేరుతాయి."
-వాంగ్ యూ, అఫ్గాన్‌కు చైనా రాయబారి
'చైనా మాకు మంచి మిత్ర దేశం'
చైనా చేసిన సాయానికిగాను హక్కానీ ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా తమకు మంచి పొరుగుదేశం, మిత్రదేశం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ తమకు చైనా నుంచి సాయం(China Help Afghanistan) అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటను మేము నిలబెట్టుకుంటాం. అప్గాన్‌ను విదేశీ ఉగ్రశక్తులకు అడ్డాగా మారనివ్వబోమని అంతర్జాతీయ సమాజానికి, పొరుగు దేశానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటాం.
- ఖలీల్-ఉర్-రెమహాన్ హక్కానీ, అఫ్గాన్ శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి.
అయితే.. వివిధ దేశాల తరహాలోనే చైనా కూడా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. కానీ, పాకిస్థాన్, రష్యాల దేశాలతో పాటుగా కాబుల్‌లో తమ దేశ రాయబార కార్యాలయాన్ని తెరిచే ఉంచింది. గత నెలలో అప్గాన్‌ను తాలిబన్ల ఆక్రమించుకున్నాక ఆ దేశం నుంచి వివిధ దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేశాయి.
భారీ ముప్పు..
ఆర్థిక మాంద్యం, రానున్న శీతాకాలం కారణంగా.. అఫ్గాన్‌లో భారీ మానవతా సంక్షోభం(Afghan Humanitarian Crisis) ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ హెచ్చరించింది. అప్గాన్‌లో పని చేసేవారికి వేతనాలు చెల్లించకపోవడమే ఈ ముప్పునకు కారణమని 'రెడ్‌క్రాస్' డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ తెలిపారు. ముఖ్యంగా వైద్య రంగంలో పని చేసేవారికి వెంటేనే జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
"కరవు, పేదరికం వల్ల ఏర్పడిన ఆహార కొరత, శీతాకాలం కారణంగా రానున్న నెలల్లో అఫ్గాన్.. అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోనుంది. ఆరోగ్య సేవలు నిలిచిపోతాయి. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని అఫ్గాన్ పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి" అని మాథ్యూ హెచ్చరించారు.
మహిళల నిరసన..
మరోవైపు.. అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ విద్యా హక్కును తాలిబన్లు హరించివేయడానికి వ్యతిరేకంగా గురువారం కాబుల్‌లోని ఓ పాఠశాల ముందు కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు. అయితే.. తాలిబన్లు వారిని తుపాకులతో బెదిరించి చెదరగొట్టారు.
ఇదీ చూడండి: మహిళా జడ్జిల కోసం వేట.. మాకే శిక్ష వేస్తారా అంటూ...
ఇదీ చూడండి: తాలిబన్ల దుశ్చర్య- తండ్రిపై అనుమానంతో పిల్లాడికి మరణశిక్ష!