కరోనా వైరస్‌కు తమది బాధిత దేశమే అని, అది తమ దగ్గర పుట్టలేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు చైనా ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఏడాది నుంచి అన్ని దేశాలను అస్తవ్యస్తం చేస్తున్న మహమ్మారికి తాము బాధ్యులం కాదని అసత్యాలు వల్లెవేస్తోంది. కరోనా మూలాలు తెలుసుకునేందుకు జరిగే ప్రతి పరిశోధనను డ్రాగన్ కచ్చితంగా నియంత్రిస్తోందని ఓ వార్తా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. చైనా ప్రభుత్వం అంతర్గతంగా ఇచ్చిన వేల కొద్దీ ఆదేశాల ప్రతులను సంపాదించింది అసోసియేటెడ్ ప్రెస్. అందులోని విస్మయకర, సంచలన విషయాలను బహిర్గతం చేసింది.
ఇలా చైనా నుంచి అంతర్గత విషయాల సమాచారం బహిర్గతం అవ్వడం చాలా అరుదని అధ్యయన సంస్థ వెల్లడించింది. విదేశీ శాస్త్రవేత్తలు, అధికారుల ఇంటర్వ్యూలతో పాటు, పబ్లిక్ నోటీసులు, ఈ మెయిళ్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రచురించని పత్రాలను ఈ అధ్యయన సంస్థ సంపాదించింది. ఇందులో కరోనా విషయంలో చైనా గోప్యత పాటిస్తుందనే విషయం స్పష్టంగా వెల్లడైందని తెలిపింది.
జిన్‌పింగ్ ఆదేశాలు..
వైరస్ వేరే దేశంలో పుట్టిందని తెలిపే సిద్ధాంతాలను ప్రోత్సహిస్తోంది చైనా. శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలపై డేగ కన్ను వేసింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యక్ష ఆదేశాల మేరకు చైనా కేబినెట్ నిర్వహించే కొత్త టాస్క్‌ఫోర్స్ కరోనాపై అధ్యయన ఫలితాలను పరిశీలిస్తోంది. ఆ పత్రాల్లో కరోనా చైనాలోనే ఉద్భవించిందన్న అంశాలు లేకపోతేనే ప్రచురణకు ఆమోదం తెలుపుతోంది. ప్రపంచంలోని మోజార్టీ శాస్త్రవేత్తలు వుహాన్‌లోని గబ్బిలాల గుహల నుంచే కరోనా పుట్టిందని అభిప్రాయపడగా.. అలాంటి ఓ గబ్బిలాల గుహను కూడా ఈ అధ్యయన బృందం పరిశీలించింది. అక్కడి స్థానికులతో మాట్లాడింది. ఇటీవల ఈ గుహలను పరిశీలించి ఓ గబ్బిలాల పరిశోధన బృందం సేకరించిన నమూనాలను అక్కడి అధికారులు జప్తు చేశారని స్థానికులు తెలిపారు. ఇక్కడ తమ చేతుల్లో ఏమీ లేదని కరోనా పుట్టుకకు కారణంగా భావిస్తున్న వుహాన్ మార్కెట్‌లోని ఓ వ్యాపారి వెల్లడించాడు.
నోటీసు ఇవ్వకుండా మా వ్యాపారాలు మూసేశారు. మీరు ఇక్కడ లోపలకు రాలేరు. మా వస్తువులను మేం తీసుకోలేం. అంతా అయిపోయింది. ఏ వస్తువును బయటకు తీయడానికి మాకు అనుమతి లేదు. ప్రభుత్వం ఈ నగరాన్ని లాక్ చేసింది. అన్ని వస్తువులను తొలగించింది.
-జియంగ్ దఫా, వుహాన్ మార్కెట్ వ్యాపారి
కరోనా వైరస్ చైనాలోనే ఉద్భవించిందన్న అధ్యయనాలు చాలా వరకు నిజమేనని పరిశోధకులు పునరుద్ఘాటిస్తున్నారు. కొన్ని జాతుల గబ్బిలాల నుంచే వైరస్ వ్యాప్తి చెందుతోందని... అవి వుహాన్‌లోని గుహల్లో ఉన్నాయని వెల్లడించారు.
చిన్న గబ్బిలాల సమూహాల నుంచి సార్స్, కరోనా వైరస్ వ్యాపించి ఉంటాయని భావిస్తున్నాం. ఈ గబ్బిలాల గుంపుల్లో అనేక ఇతర సార్స్ సంబంధిత కరోనా వైరస్‌లను కూడా గుర్తించాం. ఇవి గుహలలో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఈ గుహలు చైనా, అగ్నేయాసియాల్లో వ్యాపించి ఉన్నాయి.
-జోనా మాజెట్, అమెరికా పరిశోధకురాలు
అడుగడుగునా ఆంక్షలతో కరోనా పరిశోధనలను అడ్డుకుంటున్న చైనా ప్రభుత్వం... భవిష్యత్తు పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ మూలాలు కనుగొంటేనే భవిష్యత్‌లో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవడం సులవవుతుందని చెబుతున్నారు.