సాంకేతికతతో ప్రజా జీవనంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం, ప్రయాణం, విద్య... ఇలా రంగం ఏదైనా అధునాతన సాంకేతికతతో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. అలాంటి అద్భుతాల్ని ఏటా మనకు పరిచయం చేస్తోంది 'కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో'(సీఈఎస్).
ఈ ఏడాది చైనా షాంఘై నగరంలో ఏర్పాటు చేసిన సీఈఎస్‌లో 5జీ, కృత్రిమ మేధ, వాహన సాంకేతికత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
'అనురా' వస్తే డాక్టర్ దూరమే!
ఈ రోజుల్లో వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సాధారణ పరీక్షలకూ వేల రూపాయలు జేబు నుంచి మాయం అవుతున్నాయి. అయితే ఓ సెల్ఫీతో ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేసుకోవచ్చంటోంది కెనడియన్ కృత్రిమ మేధ కంపెనీ 'న్యూరాలాజిక్స్'. అదీ 30 సెకన్లలోనే!
ట్రాన్స్డెర్మర్ ఆప్టికల్ ఇమేజింగ్ సాంకేతికతతో 'అనురా' యాప్‌ను రూపొందించిందీ సంస్థ.
"మన ఫోన్లోని సంప్రదాయ కెమెరాను ఉపయోగించి ముఖంపై రక్త ప్రవాహాన్ని గుర్తిస్తుంది. రక్త ప్రవాహం ఆధారంగా చాలా అంశాలను సేకరిస్తాం. హృదయ స్పందన, శ్వాస, రక్తపోటుతో పాటు ఒత్తిడి, భావాలను గుర్తిస్తాం. దీనికి తోడు విచారం, ఉద్వేగం తగ్గించేందుకు, భవిష్యత్తులో గుండె సంబంధ వ్యాధులు రాకుండానూ వివిధ విధానాలను రూపొందించాం."
-కాంగ్ లీ, న్యూరాలాజిక్స్ సైన్స్ చీఫ్
సాంకేతికతకు 100 శాతం కచ్చితత్వం ఉంటే ఆరోగ్యపరమైన విషయాల్లో ఉపయోగించవచ్చని, అందుకే ఆ దిశగా కృషి చేస్తున్నామని లీ తెలిపారు. యాప్‌తో చేసిన పరీక్షల్లో 90 శాతానికిపైగా కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
ఈ యాప్‌ను వాడుకలోకి రావాలంటే అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కావాల్సిందే. ఆ స్థాయికి చేరుకోవాలంటే 5జీ సాంకేతికత తప్పనిసరని సంస్థ చెబుతోంది. అప్పుడే 'అనురా' పూర్తి స్థాయిలో పని చేస్తుందని రూపకర్తలు చెప్పారు.
మనిషికీ ఎయిర్‌బ్యాగ్స్
వయసు పెరిగే కొద్దీ శరీరం నీరసించిపోతుంది. వృద్ధాప్యంలో నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి కిందపడిపోతారు కూడా. ఎముకలు బలహీనంగా తయారవటం వల్ల విరిగే అవకాశం ఎక్కువే. అయితే ఈ ప్రమాదం నుంచి మేం కాపాడుతాం అంటోంది ఓ చైనా కంపెనీ.
సుజౌ యిడైబావో సంస్థ తయారు చేసిన ఈ పరికరం వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్ లాగే పనిచేస్తుంది. ఈ పరికరాన్ని నడుముకు బెల్ట్‌లా కట్టుకోవాలి. ఇందులో ఉండే మైక్రో గైరోస్కోప్తో మనిషి కింద పడే వేగం, కోణాన్ని గుర్తిస్తుంది. పడిపోయే సమయంలో ఒక్కసారిగా ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకుని మన శరీరాన్ని చుట్టేస్తాయి. ఫలితంగా కింద పడినా గాయాలు మాత్రం కావని సంస్థ సహాయ మేనేజర్ సోంగ్ ఝాంగ్స్వాన్ చెబుతున్నారు.
ఇదీ చూడండి: ప్రయాణానికే కాదు.. ఇక వినోదానికీ కార్లే!