ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ఈ దేశాధ్యక్షుడు జిన్పింగ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి తమ అభివృద్ధి పంథాను మార్చుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎగుమతుల ఆధారిత అభివృద్ధి బదులు.. దేశీయ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఆసియా-పెసిఫిక్ ఎకనామిక్ కొఆపరేషన్(ఏపీఈసీ) సీఈఓ చర్చల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు జిన్పింగ్. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని దేశీయ వినియోగం పెంచాలన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం చేశారు.
"ఆధునిక సోషలిస్ట్ దేశాన్ని నిర్మించేందుకు.. వచ్చే ఏడాది నుంచి చైనా ఓ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దేశీయ వ్యవస్థకు పేద్ద పీట వేసి.. అంతర్జాతీయ వ్యవస్థను దానితో అనుసంధానిస్తాం. ప్రస్థుత పరిస్థితులు, చైనా అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం."
--- జిన్పింగ్, చైనా అధ్యక్షుడు.
అనేక దేశాల నుంచి చైనాకు వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. చైనాకు అమెరికా నుంచి వచ్చే దిగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ వ్యవస్థను బలపరుచుకునేందుకు జిన్పింగ్ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేసింది. దేశీయ మార్కెట్కు భారీగా ఊతమందిస్తూ 14వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది.
ఇదీ చూడండి:- 'టీకా అభివృద్ధి కోసం భారత్కు సహకరిస్తాం'