తమ దేశానికి చెందిన దాదాపు వెయ్యిమందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దు చేయడంపై చైనా స్పందించింది. చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది. దీనిపై ప్రతి స్పందించే హక్కు చైనాకు ఉందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చైనా విద్యార్థులపై చర్యలు తీసుకుంటూ, అమెరికాలో వారిని అణచివేతకు గురిచేయడాన్ని వెంటనే ఆపాలని అన్నారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని ఝావో లిజియన్ తెలిపారు.
చైనాపై అమెరికా ఆరోపణలు..
ఇదిలా ఉంటే, చట్ట వ్యతిరేక వాణిజ్య పద్ధతులు, గూఢచర్యానికి చైనా పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఇలా అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నందున, ఇప్పటివరకు దాదాపు వెయ్యిమంది విద్యార్థుల, పరిశోధకుల వీసాలను రద్దుచేసినట్లు అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుపై మండిపడిన చైనా.. విద్యార్థులపై కక్షసాధింపు చర్యలు ఆపాలని సూచించింది.
ఇదీ చూడండి:బ్రిటన్ స్టూడెంట్ వీసాకు కొత్త నిబంధనలు