ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో సరైన సుదుపాయాలు లేక పిల్లులు టీకాలు తీసుకోలేకపోతున్నారు. వీరిని ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు టీకాలు అందించలేకపోతే దక్షిణాసియా దేశాలు మరో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
ప్రపంచ వ్యాప్తంగా రోగనిరోధకశక్తి లేని, పాక్షికంగా కలిగిన పిల్లలలో దాదాపు నాలుగింట ఒకవంతు అంటే 4.5 మిలియన్ల మంది పిల్లలు దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారు. వీరిలో 97 శాతం మంది భారత్, పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ దేశాలకు చెందినవారు.
లాక్డౌన్ కారణంగా పిల్లలకు ఇవ్వాల్సిన సాధారణ టీకాలను అందించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చిన్నారులు వ్యాధుల బారినపడే అవకాశముంది. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ దేశాల్లోని పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. పోలియో సంక్షోభం సమయంలోనూ దక్షిణ ఆసియా దేశాలైన పాక్, అఫ్గానిస్థాన్లపైనే అధిక ప్రభావం పడింది.
కరోనా ఆంక్షల కారణంగా టీకాల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి సరఫరా చేసుకునేందుకు రవాణా సౌకర్యం కూడా లేదు. తయారీ సంస్థలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. చాలా దేశాలు టీకాల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రభుత్వాలు కరోనాను వీలైనంత త్వరగా నియంత్రించేలా చర్యలు చేపట్టి టీకాల కార్యక్రమాన్ని త్వరితగతిన ప్రారంభించాలని యూనిసెఫ్ సూచించింది. చిన్నారులు తప్పనిసరిగా వ్యాక్సిన్ పొందేలా చూడాలని పేర్కొంది.