పౌరసత్వ చట్ట సవరణ(సీఏఏ), జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్ఆర్సీ)లపై ఆందోళన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్. ఈ చట్టాలు పూర్తిగా భారత అంతర్గత విషయాలే అయినప్పటికీ.. వాటి ప్రభావం పొరుగుదేశాలపై పడే అవకాశముందన్నారు.
నిరసనలతో అట్టుడుకుతున్న భారత్లో పరిస్థితి శాంతింపజేసి, పొరుగు దేశాలూ ప్రశాంతంగా ఉండేలా చేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు.
"సీఏఏ, ఎన్ఆర్సీలు పూర్తిగా భారత్ అంతర్గత అంశాలు. ఇవి తమ దేశ సమస్యలని భారత ప్రభుత్వం మాకు స్పష్టం చేసింది. చట్టపరమైన, ఇతర కారణాల వల్లే వాటిని ఏర్పాటు చేశారు. మేము(బంగ్లా) భారతదేశానికి ముఖ్య స్నేహితులం. అందుకే అక్కడ అనిశ్చితి నెలకొంటే మాపైనా ప్రభావం ఉంటుంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే చాలా దేశాలపై ప్రభావం ఉంటుంది. అదే విధంగా భారత్లో నిరసనలు మా దేశాన్ని ప్రభావితం చేస్తాయని మా భయం. ఇది చింతించాల్సిన విషయమే. భారత్లో పరిస్థితి సద్దుమణగాలని మేము ఆశిస్తున్నాం."
-ఏకే అబ్దుల్ మోమెన్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి.
భారత్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల జాబితాను ఇవ్వాల్సిందిగా దిల్లీ ప్రభుత్వాన్ని ఇటీవలే కోరారు మోమెన్. ఈ విషయమై డిసెంబర్ 12న మోమెన్ భారత్లో పర్యంటిచాల్సి ఉండగా, దేశంలో చెలరేగుతున్న 'పౌర' నిరసనల వల్ల ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు.
సీఏఏ...
2015 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి మతపరమైన హింసకు గురై... భారత్కు వచ్చిన హిందు, జైన్, క్రైస్తవ, పార్శీ, బౌద్ధమత శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ సారాంశం.
ఎన్ఆర్సీ...
ఇక అసోంలో నివసిస్తున్న భారతీయులను కనిపెట్టేందుకు.. 1971 మార్చ్ 24 కంటే ముందు నుంచి భారత దేశంలో ఉంటున్న వారిని పట్టికలో చేర్చి.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఎన్ఆర్సీని ఏర్పాటు చేశారు. ఈ కారణంగా మూడున్నర కోట్ల జనాభాలో మొత్తం 19 లక్షల మందికి ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు.
ఈ ఎన్ఆర్సీ విషయమై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన న్యూయార్క్లో మోదీతో చర్చించారు.
ఇదీ చదవండి:'పౌరచట్టం, ఎన్ఆర్సీలతో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు'