భారత్ వేదికగా నిర్వహించనున్న 'బ్రిక్స్-2021' శిఖరాగ్ర సదస్సుకు చైనా ఇటీవలే మద్దతు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఐదు సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో చైనా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
చైనా ప్రకటనను సానుకూలాంశంగానే భావించాలని మాజీ రాయబారి అశోక్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.
"భారత్-చైనా మధ్య 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాబట్టి, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వ్యాపార కార్యకలాపాల్లో పునరుద్ధరణ అవసరం. ఘర్షణలతో బంధాలను కొనసాగించకుండా బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించాలి."
-అశోక్ సజ్జనార్, మాజీ రాయబారి.
గతేడాది చోటుచేసుకున్న గల్వాన్ ఘటన అనంతరం చైనా అన్ని ఒప్పందాలను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చైనాపై నమ్మకం సన్నగిల్లింది. దీన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సజ్జనార్... యథాతథంగా చైనాతో వ్యాపారం కొనసాగించలేమని నొక్కి చెప్పారు. కానీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు సమగ్రంగా జరిపేందుకు భారత్ కొత్త వ్యూహంతో ఉండాలని సూచించారు.
"సరిహద్దు వివాదాన్ని.... భారత్‌తో జరుపుతోన్న ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంచుతామని చైనా చెబుతోంది. కానీ, ఇది సాధ్యం కాదు."
-అశోక్ సజ్జనార్.
అంతర్జాతీయ వ్యవహారాలతో సంబంధం లేనట్లు చైనా ప్రవర్తిస్తోందని సజ్జనార్ అన్నారు. హాంకాంగ్, తైవాన్‌తో కయ్యానికి కాలుదువ్వడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. తమ శక్తిని పెంచుకునేందుకే చైనా ప్రయత్నిస్తుంటుందని, ఇతర దేశాలు తమకు భయపడాలనే ఆలోచనా ధోరణితో ఉంటుందని అన్నారు.
గల్వాన్ ఘటనను మరచి... తమ దేశంతో వ్యాపారం చేసేందుకు భారత్ ముందుకు రావాలని చైనా ఆశిస్తోంది. కానీ, భారత్ ఇందుకు సుముఖంగా లేదు.
"ఒకవేళ బ్రిక్స్ సదస్సు జరిగినా చైనాకే లాభం ఎక్కువ. ఎందుకంటే బ్రిక్స్ బ్యాంక్ కార్యనిర్వహణలో చైనా భాగస్వామ్యం ఎక్కువ. అందుకే ఈ సదస్సుకు చైనా మద్దతు పలుకుతుంది."
-అశోక్ సజ్జనార్.
2021 సంవత్సరానికిగాను బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి ఛైర్మన్ పదవిని భారత్ చేపట్టింది. త్వరలో శిఖరాగ్ర సదస్సును నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: అమెరికా పౌరసత్వానికి పాత పద్ధతికే బైడెన్ జై