బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విలయానికి మంగళవారం ఆరుగురు మృతి చెందగా... తాజాగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో చిక్కుకున్న ఇద్దరు యువకులు, ఓ చిన్నారి కొండచరియలు విరిగిపడి మృతిచెందారు.
రియో డి జెనీరోలో సోమవారం రాత్రి నాలుగు గంటల్లోనే 152 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా... మొత్తంగా గడచిన 24 గంటల్లో 231 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి పరిస్థితి అస్తవ్యస్తమైంది.
వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాహనాలు, చెట్లు భారీగా ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.