ఇండోనేసియాలో అదృశ్యమైన బోయింగ్ 737-500 విమానం జావా సముద్రంలో కుప్పకూలినట్లు అధికారులు ప్రకటించారు. 75 అడుగుల లోతులో విమాన శకలాలను గుర్తించామన్నారు. ఇదివరకే కొన్ని శకలాలు, వ్యర్థాలను వెలికి తీయగా.. అవి కూలి విమానానివేనని ధ్రువీకరించినట్టు స్పష్టం చేశారు.
"డైవర్ టీం నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం విమాన శకలాలు కనుగొనేందుకు వీలుగా సముద్ర వాతావరణం ఉంది. ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం వరకు వాతావరణం ఇలానే ఉంటే గాలింపు చర్యలను కొనసాగిస్తాం. విమానం కుప్పకూలిన స్థలం ఇదే అని కచ్చితంగా చెప్పగలం."
--హాది జాజంతొ, ఇండోనేసియా ఎయిర్ చీఫ్ మార్షల్
ఈ ఘటన పట్ల సంతాపం తెలిపారు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో. అయితే విమానం కుప్పకూలటానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు. ప్రయాణికుల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం లేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..
మొత్తం 62మంది ప్రయాణికులతో బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు జకార్తా నుంచి బయలుదేరింది. 90 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి.