బంగ్లాదేశ్ జాతిపిత ముజీబుర్ రెహమాన్ శత జయంత్యుత్సవాలు వాయిదా వేసినట్లు ఆ దేశం ప్రకటించింది. ఆ దేశంలో కొన్ని గంటల క్రితం మూడు కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు కారణమని అక్కడి మీడియా తెలిపింది.
వాస్తవానికి మార్చి 17న ఢాకాలోని నేషనల్ పరేడ్ మైదానంలో జయంత్యుత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు విదేశీ ప్రముఖులకు సైతం ఆహ్వానం అందింది. బంగ్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
భారీ స్థాయిలో జరగకపోవచ్చు..
అయితే.. ఉత్సవాలు నిర్వహించే అవకాశం ఉందని, భారీస్థాయిలో మాత్రం జరగకపోవచ్చని తెలుస్తోంది. విదేశీ అతిథులు హాజరు కాకపోవచ్చని 'డైలీస్టార్' అనే వార్త సంస్థ నివేదించింది. అలాగే అంగరంగ వైభవంగా జరగాల్సిన వేడుకలను.. ఆర్భాటం లేకుండా తక్కువ మంది సమూహంలో నిర్వహిస్తామని జాతీయ కమిటీ సమన్వయ కర్త కమల్ తెలిపారు. వేడుకలపై సోమవారం పునఃప్రణాళిక రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.
ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరికి సహా మరో వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి వచ్చిన పౌరులను వైద్యుల ధ్రువీకరణ అనంతరమే దేశంలోకి అనుమతిస్తునట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఇకపై అంతరిక్షంలోనూ ఆకుకూరలు లభ్యం..!