'ఫొని' తుపాను కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలోని 5 లక్షల మందిని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారత్లో ఫొని సృష్టించిన విధ్వంసాన్ని చూసిన బంగ్లాదేశ్ చిగురుటాకులా వణుకుతుంది. భారత వాతావరణ విభాగం ఫొనిని 'అత్యంత ప్రమాదకర తుపాను'గా పేర్కొంది.
ఖుల్నా ప్రాంతం ద్వారా బంగ్లాదేశ్‌లో శనివారం సాయంత్రం కల్లా ప్రవేశించనుంది ఫొని ప్రచండ తుపాను. తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు, కుండపోత వర్షంతో విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ విభాగం హెచ్చరించింది.
సైన్యం, నావికా దళం, తీర ప్రాంత గస్తీ దళాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అయితే భారత్లోని ఒడిశాలో సృష్టించిన బీభత్సంతో పోలిస్తే ఫొని తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ తీవ్ర పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో శనివారం వరకు బలమైన గాలులతో పాటు కుండపోత వర్షాలు తప్పవని తెలిపారు.
- ఇదీ చూడండి: ఫొని బీభత్సం: పూరీ ప్రాంతంలో ఏరియల్ సర్వే